అధ్యక్షుడి సందేశం
సింగపూర్ లో ఉంటున్న తెలంగాణ వాసులందరికి హృదయపూర్వక నమస్కారాలు! సింగపూర్ లో నివసిస్తున్న తెలంగాణ వారందరి కొరకు ఒక వేదిక ను ఏర్పరచి మన తెలంగాణ జానపద, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించి మన భావి తరాలకు అందజేయడం కొరకు ఎలాంటి లాభాపేక్ష లేకుండా జాతి మత కుల వర్ణ భేదాలకు అతీతంగా ఏర్పరచిన సంస్థే మన “తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్”. మన ఈ “తెలంగాణ కల్చరల్ సొసైటి” అనేది సింగపూర్ లో మన తెలంగాణ వారి కొరకు స్థాపించిన ఏకైక సంస్థ.
ఈ సొసైటి అవిర్భావం కన్నా ముందు 2009 నుండి “సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్” గా అందరికి సుపరిచితం. అదే “సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్” అధికారికంగా 2012 లో “తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్” గా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సొసైటి ఆవిర్భావానికి సహకారం అందించిన ఎంతోమంది మన తోటి తెలంగాణ సోదరసోదరీమణులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియ జేసుకుంటున్నాను.“తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్” ఆవిర్భవించిన అనతికాలంలోనే విశేష ఆదరణతో ముందుకు సాగడానికి సహాయసహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మన రాష్ట్ర ప్రప్రథమ ముఖ్య మంత్రి గౌ. శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు సింగపూర్ వచ్చినప్పుడు, మన సొసైటి అధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని తెలంగాణ సంస్థల్లోకెల్ల ఈ అవకాశం దక్కింది మన “తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్” కు మాత్రమే. ఈ అవకాశం మన సొసైటి కి లభించడం ఎంతో గర్వకారణం.
మన ఈ సంస్థ కు నేను ప్రప్రథమ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మరియు మన సంస్థ స్థాపన కంటే ముందునుండి నమ్మకంతో నాకీ భాద్యతని అప్పగిస్తూ వస్తున్న మన సొసైటి సభ్యులకు,మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు నేను మనవి చేసేది ఒక్కటే, నాకు అప్పగించిన ఈ బృహత్తర బాధ్యతను సింగపూర్ లో ఉంటున్న ప్రతి ఒక్క తెలంగాణ వాసి సహకారంతో దక్షతతో విజయవంతంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా సింగపూర్ లో ఉంటున్న మన తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం నాకు లభిచడం నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఇక మన తెలంగాణ ముఖ్య పండుగైనటువంటి బతుకమ్మ, దసరా,సంక్రాంతి,ఉగాది మరియు దీపావళి మొదలగు పండుగలను, ఆట పాట ముచ్చట లాంటి కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మన సొసైటి ఆధ్వర్యం లో జరుపుకుంటున్నాము. అంతే కాకుండా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము, సమాజ సేవలో బాగంగా రక్త దాన శిబిరాల నిర్వహణ మరయు సింగపూర్ లో ఉంటున్న మన తెలంగాణ వాసులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన చేతనైన సహాయం మన ఈ సొసైటి ఆధ్వర్యం లో చేయడం జరుగుతుంది. కావున మన సింగపూర్ లో ఉంటున్న తెలంగాణ వాసులందరి సహాయసహకారాలు ఎంతో అవసరం. మనందరం కలిసి కష్టసుఖాలను పంచుకుందాం. దయచేసి ఈరోజే మన ఈ “తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్” లో సభ్యులుగా చేరండి. సభ్యులే సంస్థ కు బలం. కావున మన ఈ సొసైటి ని సింగపూర్ లో ఉంటున్న మన బందుమిత్రులందరికి పరిచయం చేయండి. మన సొసైటి సభ్యులుగ చేరుటకు ప్రోత్సహించండి.
“నా తెలంగాణ కోటి రతణాల వీణ”
మీ సేవలో,
గడప రమేష్ బాబు
(తెలంగాణ కల్చరల్ సొసైటి సింగపూర్ అధ్యక్షులు)
కృతజ్ఞతలు